పంచారామ క్షేత్ర దర్శనం.. సర్వ పాపహరణం..

తెలుగు నెలల్లో కార్తీక మాసం చాలా ప్రత్యేకమైనది. ఈ మాసంలో ప్రతి రోజూ చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. దేవాలయాల్లో ఆకాశదీపం వెలిగిస్తారు. మహిళలు దేవాలయాల్లోనూ, ఇంట్లోనూ, తులసికోట దగ్గరా దీపాలు వెలిగిస్తారు. శివాలయంలో అభిషేకాలు చేయించుకుంటారు. పౌర్ణమి, ఏకాదశి, ద్వాదశి రోజులైతే మరింత పవిత్రంగా భావిస్తారు. కొందరు కార్తీక మాసంలో తమ ఇంట వ్రతాలు చేస్తారు. శివయ్య అనుగ్రహం పొందడానికి శివాలయాలను దర్శిస్తుంటారు. ఈ నెలలో పంచభూతాలకు అధిపతైన శివుడు పంచరూపాల్లో వెలసిన పంచారామాలను సందర్శించడం వల్ల విశేషమైన ఫలాలను అనుగ్రహిస్తాడని భక్తుల నమ్మిక. అందుకే కార్తీకమాసంలో పంచారామ క్షేత్ర దర్శనం చేసుకుంటారు. తారకాసుర వధ సమయంలో శివుని ప్రాణలింగం ఐదు ముక్కలవుతుంది. ఆ ఐదు ప్రదేశాలనే పంచారామాలుగా భావిస్తున్నాం.

తారకాసుర వధకు, పంచారామ క్షేత్రాలకు సంబంధమేంటి? తారకాసురుడు ఓ రాక్షసుడు. శివుని గురించి ఘోర తపస్సుచేసి ప్రాణలింగాన్ని వరంగా పొందాడు. సాక్షాత్తూ శివస్వరూపమైన ప్రాణలింగం తన దగ్గరుందనే గర్వంతో స్వర్గలోకంపై దండెత్తి ఇంద్రుణ్ని జయిస్తాడు. ఓడిపోయిన దేవతలంతా విష్ణువును శరణు కోరారు. అయితే తారకాసురుడు శివుడి ప్రాణలింగాన్ని పొందాడని అతన్ని తాను ఏమీ చేయలేననీ పరిష్కారం శివుణ్నే అడగమని చెబుతాడు. అప్పుడు తారకాసురుణ్ని సంహరించే కార్యాన్ని తన కుమారుడైన కుమార స్వామికి అప్పగిస్తాడు పరమశివుడు. ఎంత ప్రయత్నించినా కుమారస్వామి తారకాసురున్ని అంతం చేయలేకపోతుంటాడు. అప్పుడు కుమారస్వామి తన తండ్రిని ఉపాయం చెప్పాల్సిందిగా ప్రార్థిస్తాడు. తారకాసురుడి గొంతులో ఉన్న ప్రాణలింగాన్ని ఛేదిస్తే ఆ రాక్షసుడు మరణిస్తాడనే రహస్యం చెబుతాడు. దాంతో తారకాసురుడి గొంతును పగలగొడతాడు కుమారస్వామి. ఆ రాక్షసుడి గొంతులో ఉన్న ప్రాణలింగం ఐదు ముక్కలవుతుంది. అవి కృష్ణాగోదావరీ తీర ప్రాంతంలో ఐదు చోట్ల పడ్డాయి. అవే పంచారామాలుగా విలసిల్లుతున్నాయి.

ద్రాక్షారామం

దక్షిణ భారత దేశంలోని అతి ప్రాచీన క్షేత్రం ద్రాక్షారామం. దక్షప్రజాపతి పేరు మీదుగా ద్రాక్షారామం ఏర్పడింది. ఇప్పటికీ అదే పేరుతో పిలవబడుతోంది. ఈ క్షేత్రం చాలా సుప్రసిద్ధమైనది. పంచారామాలు, త్రిలింగ క్షేత్రాలు, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. ఇక్కడ ఆ జంగమయ్య భీమేశ్వరుడిగా మాణిక్యాంబ సమేతుడే వెలిశాడు. శివలింగం సుమారుగా పది అడుగుల పొడవులో సగం నలుపు, సగం తెలుపు రంగుల్లో ఉంటుంది. ఇది అర్థనారీశ్వర తత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ మహాశివుణ్ని దర్శనం చేసుకోవాలంటే ఐదు ప్రాకారాలు దాటాల్సి ఉంటుంది. ఇక్కడి పుష్కరిణిని సప్తగోదావరిగా పిలుస్తారు. గోదావరీ నది అంతర్వాహిణిగా ప్రవహించి పుష్కరిణిని చేరుతుందని భక్తుల నమ్మిక. ఇక్కడ నారాయణుడు మహాలక్ష్మీ సమేతుడై వెలిశాడు. ఈ క్షేత్రంలో హరిహరులు ఒక్కటే అని చాటేందుకు మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వరునికి, మహాలక్ష్మీ సమేత శ్రీమన్నారాయణుడికి మాఘశుద్ధ ఏకాదశికి ఒకే వేదికపై కల్యాణం జరిపిస్తారు. సుమారు పన్నెండు ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ దేవాలయం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ క్షేత్రం తూర్పుగోదావరి జిల్లాలోని ప్రధాన నగరాలకు అతి చేరువలో ఉంది. రాజమండ్రికి 52 కి.మీ, కాకినాడకు 28 కి.మీ., అమలాపురానికి 25 కి.మీ. దూరంలో ఉంది. రాజమండ్రి, కాకినాడకు రైలులో చేరుకుని అక్కడి నుంచి బస్సు లేదా ఇతర వాహనాల్లో ద్రాక్షారామం చేరుకోవచ్చు. అమలాపురం వరకు బస్సులో చేరుకుని అక్కడి నుంచి బస్సుల లేదా ఇతర వాహనాల్లో ద్రాక్షారామం చేరుకోవచ్చు.

క్షీరారామం

పరమశివుడు పార్వతీ సమేతుడై క్షీరారామలింగేశ్వరుడిగా వెలసిన క్షేత్రం క్షీరారామం. ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాలో పాలకొల్లు పట్టణంలో ఉందీ క్షేత్రం. ఇక్కడి శివలింగాన్ని సాక్షాత్తూ శ్రీరామచంద్రుడే ప్రతిష్ఠించారని చెబుతారు. అందుకే ఆ రాముడి పేరు మీదే క్షీరారామలింగేశ్వరుడు అని పిలుస్తారు. అందుకే ఇక్కడ క్షేత్రపాలకుడిగా మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై కొలువుదీరాడు. ఇక్కడి శివలింగానికి ఓ ప్రత్యేకత ఉంది. తారకాసుర సంహార సమయంలో ముక్కలైన శివుడి ప్రాణలింగంలోని పైభాగం ఇక్కడ పడిందట. దానికి నిదర్శనంగా లింగం పై భాగంలో కాస్త మొనతేలి ఉంటుంది. దాన్నిశివుడి కొప్పుగా పరిగణిస్తారు. అందుకే ఈయన్ను కొప్పులింగేశ్వరుడు అని కూడా పిలుస్తారు. మహాశివరాత్రికి శ్రీశైలం మల్లిఖార్జునుడి మాదిరిగా క్షీరారామలింగేశ్వరుడికి కూడా కొప్పు చుడతారు. దేవాలయ గాలిగోపురం సుమారుగా 120 అడుగులు ఎత్తు ఉంటుంది. గోపురమంతా అద్భుతమైన శిల్పకళతో అలరారుతూ ఉంటుంది. తొమ్మిది అంతస్థులున్నఈ రాజగోపురం రెండో అంతస్థు నుంచి ఉత్తరాయణ, దక్షిణాయన ప్రారంభరోజుల్లో ఉదయం వేళ సూర్యకిరణాలు శివలింగంపై పడుతుంటాయి. కార్తీకమాసం, శివరాత్రి సమయాల్లో భక్తుల రద్ధీ అధికంగా ఉంటుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల నుంచి పాలకొల్లుకు బస్సు, రైలు సర్వీసులున్నాయి.

సోమారామం

ఇక్కడి శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడు కాబట్టి ఈ క్షేత్రానికి సోమారామం అని పేరు వచ్చింది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి అతి చేరువలో ఉన్న గునుపూడి గ్రామంలో ఉందీ క్షేత్రం. ఇక్కడి శివుడ్ని సోమేశ్వర జనార్థనుడని పిలుస్తారు. సోమారామంలో ప్రతిష్ఠించిన శివలింగం తెల్లగా ఉంటుంది. దీని రంగు చంద్రుడి షోడశ కళలను బట్టి మారుతూ ఉంటుంది. పౌర్ణమినాడు తెలుపు వర్ణంలోనూ, అమావాస్యనాడు గోధుమ వర్ణంలోనూ కనిపిస్తుంది. ఇక్కడ గుడి రెండు అంతస్థులుగా ఉంటుంది. మొదటి అంతస్థులో స్వామి వారు పూజలందుకుంటుంటే.. రెండో అంతస్థులో అన్నపూర్ణాదేవిగా పార్వతీదేవి దర్శనమిస్తుంది. స్వామివారి కంటే అమ్మవారు పైభాగంలో ఉండటం ఈ ఆలయం ప్రత్యేకతల్లో ఒకటి. ఈ క్షేత్రంలో ఉన్న చంద్ర పుష్కరిణిలో స్నానం చేస్తే సకల పాపాలు పోతాయని భక్తులు విశ్వసిస్తారు. విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ నుంచి భీమవరానికి బస్సు, రైలు మార్గాల్లో చేరుకోవచ్చు.

అమరారామం

గుంటూరు జిల్లాలోని అమరావతిలో చాముండేశ్వరీ సమేతుడై కొలువు దీరాడు అమరేశ్వరస్వామి. దేవరాజు ఇంద్రుడు ఇక్కడి లింగాన్ని ప్రతిష్ఠించాడు. ఈ శివలింగం నిత్యం పెరిగిపోవడం గమనించిన ఇంద్రుడు పరమశివునికి అభిషేకాలు, బిల్వార్చనలు చేశాడట. కానీ ఎత్తు పెరగడం ఆగకపోవడంతో లింగంపై భాగంలో మేకు కొట్టి కృష్ణానదీజలాలతో అభిషేకించడాట. ఆ తర్వాతే లింగం పెరగడం ఆగిపోయిందట. ఈ క్షేత్రంలోని లింగం పంచారామాలన్నింటిలోకి అతి పొడవైనది. సుమారుగా 16 అడుగుల పొడవు ఉంటుంది. ఇక్కడి గర్భాలయం రెండు అంతస్థుల్లో ఉంటుంది. పై అంతస్థు నుంచి లింగరూపుడికి అభిషేకం నిర్వహిస్తారు. గుంటూరుకు సుమారుగా 25 కి.మీ దూరంలో ఉంటుంది అమరారామం. విజయవాడకు 40 కి.మీ. దూరంలో ఉంది. ఈ రెండు నగరాల నుంచి అమరారామానికి రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు.

కుమారరామం

తూర్పు గోదావరి జిల్లాలోని సామర్లకోటలో ఉందీ క్షేత్రం. ఇక్కడి శివలింగాన్ని కుమారస్వామి ప్రతిష్టించాడు. ఆయన పేరు మీదుగానే ఇక్కడ వెలసిన శివుణ్ని కుమార భీమేశ్వరుడిగా పిలుస్తారు. ఇక్కడ పరమశివుడు బాలాత్రిపురసుందరి సమేతుడై కొలువు దీరాడు. ఇక్కడ క్షేత్ర పాలకుడు మాండవ్యనారాయణుడు. ఈ ఆలయం కూడా రెండు అంతస్థుల్లో ఉంటుంది. చైత్ర, వైశాఖ మాసాల్లో సూర్యకిరణాలు నేరుగా ఆలయంలో ప్రసరిస్తాయి. ఉదయం వేళల్లో భీమేశ్వరుడి పాదపీఠాన్ని, సాయంసంధ్యా సమయంలో అమ్మవారి పాదాలను తాకుతాయి. ఇక్కడ ఉన్న భీమగుండంలో స్నానం చేస్తే పాపపరిహారం జరగడంతో మనోభీష్టాలు నెరవేరుతాయని భక్తుల నమ్మిక. ఈ క్షేత్రాన్ని దర్శించాలనకునేవారు సామర్ల కోటకు రోడ్డు, రైలు మార్గాల ద్వారా చేరుకోవచ్చు.

Featured Image: Pixabay

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.