అరకు అందాలు చూసొద్దాం రండి..

ఆంధ్ర ఊటీగా పిలుచుకునే అరకు.. ప్రకృతి అందాలకు నెలవు. ఎటు చూసినా పచ్చని కొండలు.. వాటి సోయగాలు.. పర్యాటకులను కట్టిపడేస్తాయి. వీటికి తోడు గిరిజన సంస్కృతులు, అందమైన జలపాతాలకు ఫిదా కావడం ఖాయం. తూర్పు కనుమల్లోని అరకు అందాలను చూస్తే మది పులకరించక మానదు. ముఖ్యంగా చలికాలంలో వెళ్తే వచ్చే ఆ మజాయే వేరు. తక్కువ ఖర్చుతో మధురానుభూతులను మూట కట్టుకోవాలంటే ఒక్కసారి అయినా అరకు వెళ్లాల్సిందే.

రైలు ప్రయాణం చెయ్యాల్సిందే..

అరకు వెళ్లాలంటే.. రైల్లో వెళ్లాల్సిందే. విశాఖ నుంచి అరకు 130 కిలోమీటర్ల దూరంలో ఉంది. సుమారు నాలుగు గంటల ప్రయాణం. ఉదయం 6 .50 గంటలకు విశాఖ–కిరండూల్‌ పాసెంజర్ బయల్దేరుతుంది. అరకు అందాలకు ఈ ప్రయాణం ఒక టీజర్ లాంటిది. అందుకే ఎక్కువ మంది అరకు టూర్ ని ఈ రైలు ప్రయాణంతోనే మొదలు పెడతారు. సొంత వాహనాలు వున్నా సరే.. రైలు ప్రయాణానికి మొగ్గు చూపుతారంటే ప్రయాణం ఎంత అద్భుతంగా ఉంటుందో ఊహించుకోండి. రైలు కదిలింది మొదలు.. ప్రతిక్షణం అద్భుతమే. విశాఖ నుంచి గంటన్నర ప్రయాణం తర్వాత ఎస్.కోట స్టేషన్ వస్తుంది. ఇక్కడ నుంచే అసలు ట్రిప్ మొదలవుతుంది. ఈ మార్గం లో మొత్తం 52 సొరంగాలు ఉన్నాయి. ఒక్కో సొరంగం 150 మీటర్ల నుంచి కిలోమీటర్ పొడవు ఉంటాయి. వెలుగు చీకట్ల మధ్య నడిచే ఈ ప్రయాణాన్ని ఒక్కసారి అయినా చేయాల్సిందే. ఇప్పుడు ఇదే రైలులో విస్టాడోమ్‌ కోచ్‌(అద్దాల పెట్టె) అందుబాటులోకి వచ్చింది. ఈ బోగీలో ప్రయాణించాలంటే ముందుగా బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విస్టాడోమ్‌ కోచ్‌లలో సీట్లు 180 డిగ్రీల కోణంలో తిరిగే సౌకర్యం ఉంటుంది. అరకు పర్యాటకానికి మరింత అందాన్నిచ్చేలా ఈ విస్టాడోమ్‌ కోచ్ ల సంఖ్యను పెంచాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి.

Advertisements

ముందు బొర్రా గుహలు..

అరకు కంటే ముందు బొర్రా గుహలు స్టేషన్ వస్తుంది. ఇక్కడకు 7 కి.మీ. దూరంలో కటికి వాటర్ ఫాల్స్ ఉంది. గోస్తనీ నది 50 అడుగుల ఎత్తు నుంచి కింద పడే ప్రదేశం కనువిందు చేస్తుంది. అయితే ఇక్కడకి వెళ్లాలంటే కొంత దూరం నడిచి వెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత బొర్రా గుహల సందర్శనకు వెళ్లొచ్చు. ఈ గుహలకు 150 మిలియన్ సంవత్సరాల చరిత్ర ఉంది. 1807 లో విలియం కింగ్ జార్జ్ వీటిని కనుగొన్నారు. సున్నపురాయితో ఏర్పడిన ఈ గుహలు చూస్తే ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాల్సిందే. గుహల్లోనే శివలింగం, తల్లీకూతుళ్లు వంటి ఆకృతులు కనిపిస్తాయి. ఇక్కడకి దగ్గర్లోనే తాడిగూడెం జలపాతం ఉంది. బొర్రా గుహలు చూసిన తరువాత అరకు వెళ్లడమే.

గాలికొండ వ్యూపాయింట్ చూసుకుని..

విశాఖపట్నం జిల్లాలో అత్యంత ఎత్తైన ప్రదేశం గాలికొండ వ్యూపాయింట్. బొర్రా- అరకు మధ్యలో ఇది ఉంటుంది. ఒక పక్క పచ్చని లోయ, కొండలు.. మరో పక్క రైల్వే ట్రాక్, కాటేజీలు కనిపిస్తాయి. ఆ తరువాత వెళ్లే దారిలోనే అద్భుతమైన అరకు కాఫీ రుచిని టేస్ట్ చేయొచ్చు. పక్కనే కాఫీ తోటల అందాలను చూడొచ్చు. అవి చూసుకుని రాత్రికి అరకులో బస చూసుకోవాలి. ఇక్కడ ఏపీటీడీసీ రిసార్ట్స్ లతో పాటు మంచి హోటల్స్ సైతం ఉన్నాయి.

Advertisements

రెండో రోజు ఇలా..

ఉదయం బ్రేక్ ఫాస్ట్ ముగించిన తర్వాత పద్మాపురం గార్డెన్స్, ట్రైబల్ మ్యూజియం, అనంతగిరి కాఫీ ప్లాంటేషన్, చాపరాయి వంటి ప్రదేశాలను సందర్శించొచ్చు. ట్రైబల్ మ్యూజియంలో గిరిజనుల జీవనాన్ని ప్రతిబింబించే వివిధ కళాకృతులు ఉంటాయి. పద్మాపురం గార్డెన్స్ లో అరుదైన మొక్కలను చూడొచ్చు. ఇక అరకు- పాడేరు మార్గం లో చాపరాయి ఉంది. ఇక్కడి సెలయేళ్ళు అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ దొరికే బొంగు చికెన్ టేస్ట్ చెయ్యాల్సిందే. కొంత దూరం వెళ్తే గిరిజనులు సాగు చేసే పోడు వ్యవసాయం, వలిసెల పువ్వుల పంటలు ముగ్ధ మనోహరంగా ఉంటాయి. ఇక్కడితో అరకు పర్యటన ముగించొచ్చు.

ప్యాకేజీలు ఉన్నాయి..

ఏపీటీడీసీ అరకు టూర్ ను మన్యం ప్యాకేజీ (అరకు – లంబసింగి– అరకు)గా అందిస్తోంది. పెద్దలకు రూ.999, చిన్నపిల్లలకు రూ.799గా టికెట్‌ ధర. అరకు నుంచి లంబసింగి కూడా సమీపంలోనే ఉండటంతో రెండు పర్యాటక ప్రాంతాలనూ కలుపుతూ మధ్యనున్న చాపరాయి, మత్స్యగుండం, కొత్తపల్లి జలపాతాలతో పాటు ఆపిల్, పైనాపిల్, స్ట్రాబెర్రీ పండ్ల తోటలను చూసొచ్చేలా మరో ప్యాకేజీని అమల్లోకి తెచ్చారు. ప్రతి రోజూ బస్సు అరకు నుంచి ఉదయం 7 గంటలకు బయల్దేరి ఆయా ప్రాంతాలను చుట్టేసి రాత్రికి తిరిగివస్తుంది. అలా కాకుండా ఒక బృందంగా విశాఖపట్నం నుంచి లంబసింగి వెళ్లాలనుకునేవారు ముందుగా సంప్రదిస్తే కార్లను ఏపీటీడీసీ అధికారులు ఏర్పాటు చేస్తారు.

Advertisements

రైల్‌ కమ్‌ రోడ్డు ప్యాకేజీ

గతంలో పర్యాటకులకు మంచి మజిలీని అందించిన రైల్‌ కమ్‌ రోడ్‌ ప్యాకేజీని ఇప్పుడు కొద్ది మార్పులతో ఏపీటీడీసీ సెప్టెంబర్‌లో పునఃప్రారంభించింది. రూ.1450తో పెద్దలకు, రూ.1160 పిల్లలకు ఈ టికెట్‌ ధర నిర్ణయించారు. రైల్వేశాఖతో సంబంధం లేకుండా నేరుగా ఐఆర్‌సిటిసి ద్వారా రైల్‌ టికెట్లు బుక్‌ చేసి… ఈ ప్యాకేజీని ఏపీటీడీసీ అందిస్తోంది. పద్మాపురం బొటానికల్‌ గార్డెన్, ట్రైబల్‌ మ్యూజియం, ట్రైబల్‌ థింసా, అనంతగిరి కాఫీ ప్లాంటేషన్, గాలికొండ వ్యూపాయింట్, బొర్రా కేవ్స్, టైడా జంగిల్‌ బెల్‌కు తీసుకువెళతారు. రోడ్డు మార్గాన వెళ్లాలనుకునేవారి కోసం అరకు–బొర్రా రోడ్డు ప్యాకేజీ టూర్‌ ఉంది. రవాణా చార్జి కింద పెద్దలకు రూ.700, పిల్లలకు రూ.560 చెల్లించాలి.

Images: Araku valley, Araku Valley Camping

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.