జార్జి రెడ్డి సినిమా రివ్యూ

జార్జి రెడ్డి ( George Reddy ) .. తెలుగు ప్రేక్షకుల అటెన్షన్ బాగా క్యాచ్ చేసిన సినిమా. ఈ మధ్య కాలంలో ఓ సినిమా విడుదల ముందే ఇంత క్రేజ్ తెచ్చుకున్నది లేదు. 70వ దశకంలో విద్యార్ధి నాయకుడిగా ఓ వెలుగు వెలిగిన జార్జిరెడ్డి జీవిత కథ ఇది. ఆయన పేరుతోనే బయోపిక్ గా దీన్ని తెరకెక్కించారు. ప్రచార చిత్రాలు, ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేశాయి. ఉస్మానియా విద్యార్థులకు జార్జిరెడ్డి జీవితం సుపరిచితమే. ఆయన గురించి తెలిసినవాళ్లు వెండితెరపై ఆయన జీవితం ఎలా ఉందో చూద్దామని, జార్జి రెడ్డి ఎవరో తెలియని వారు ఆయన ఎవరో తెలుసుకుందామనే కుతూహలంతో ఉన్నారు. చాలా తక్కువ సమయంలోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా ఎంతవరకు జనాన్ని ఆకట్టుకోగలిగింది చూద్దాం.

కథ విషయానికి వస్తే.. ఆవేశం, తెలివితేటలు బాగా ఉన్న జార్జి రెడ్డి ( సందీప్ మాధవ్ ) పీజీ చదవడం కోసం ఉస్మానియా యూనివర్శిటీకి వస్తాడు. అక్కడ ఎదురయ్యే సమస్యలను చూస్తూ ఊరుకోకుండా వాటిని చక్కదిద్దే ప్రయత్నం మొదలుపెడతాడు. అన్యాయానికి ఎదురు తిరుగుతాడు. విద్యార్థుల్లో చైతన్యం నింపి వారికి నాయకుడవుతాడు. ఇది చాలామందికి కంటగింపుగా మారుతుంది. వాళ్లు జార్జి రెడ్డిపై దాడులు చేయడం మొదలుపెడతారు. జార్జి రెడ్డి వారిని ఎలా ఎదుర్కొన్నాడు.. చివరికి అతడి కథకు ముగింపు ఏంటి అన్నది తెరమీదే చూసి తెలుసుకోవాాలి.

జార్జి రెడ్డి బాక్సర్, ఆవేశపరుడు, చదువుల్లో గోల్డ్ మెడలిస్ట్, తన మాటలతో, చేతలతో ఎదుటి వారిలో స్ఫూర్తి రగిలించగలిగిన సమర్థుడు. అతడి సమాధాన పత్రం చూసి బొంబాయి యూనివర్సిటీ ప్రొఫెసర్ వెతుక్కుంటూ ఉస్మానియా క్యాంపస్ కి వచ్చాడంటే అతని ప్రతిభ ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. ఇన్ని కోణాలున్న జార్జి రెడ్డిని ఈ సినిమాలో కేవల యాక్షన్ హీరోగానే చూపించారు. ఫైట్లకే ప్రాధాన్యమిచ్చారు. జార్జి రెడ్డి జీవితాన్ని వాస్తవికంగా చిత్రీకరించడానికి బదులు కమర్షియల్ సినిమాగా రూపొందించినట్టుగా అనిపిస్తుంది. విద్యార్థి నాయకుడిగా జార్జి రెడ్డి ఎందుకు అంత అభిమానాన్ని చూరగొన్నాడో తెరపై చూపించలేకపోయారు. ఆయన్ని కేవలం ఫైట్లు చేసే హీరో అయ్యాడన్నట్లుగా చూపించారు. అందుకే ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ‘ఎ మ్యాన్ ఆఫ్ యాక్షన్’ అని ట్యాగ్ లైన్ పెట్టాం కదా అని జార్జి రెడ్డిని యాక్షన్ కే పరిమితం చేసినట్టున్నారు.

బాక్సింగ్, ప్రత్యర్థులను రఫ్ఫాడించడం చేసే జార్జి రెడ్డి ఉస్మానియా చేగువేరా అని పేరు తెచ్చుకోలేదు. ఆయనలో అంతకు మించిన గొప్ప లక్షణాలున్నాయి. వాటిని తెరపై దర్శకుడు జీవన్ రెడ్డి సరిగ్గా చూపించలేకపోయాడు. జార్జి రెడ్డి గురించి తెలుసుకుందామనే ఉత్సుకతతో థియేటర్ కి వెళ్లినవారికి ఆయన ఫైట్లు మాత్రమే చేశాడనే అభిప్రాయం కలగొచ్చు. జార్జి రెడ్డి గురించి తెలిసినవారికి ఆయన గురించి సరిగ్గా తెరపై చూపించలేదనే భావన ఏర్పడుతుంది.

జార్జి రెడ్డి జీవితంలోని మిగతా కోణాల్ని చూపించలేదా అంటే చూపించారు. కానీ అంత ప్రభావవంతంగా తెరకెక్కించలేకపోయారు. పది మందిని ఒక్కడే మట్టి కరిపించగలిగిన శారీరక దృఢత్వం, చదువులో అసమానమైన ప్రతిభ, అద్భుతమైన రచనలు చేయగలిగిన సామర్థ్యం అన్నీ ఒక్కరిలో చూడటం చాలా అరుదు. ఇవే కాకుండా ఆయనలో ఇంకా ఎన్నో విభిన్నమైన కోణాలున్నాయి. వాటన్నింటినీ వదిలేసి తప్పు చేసిన వాడిని చితక్కొట్టేవాడిగానే చూపించారు. అందుకే జార్జి రెడ్డి మనసు పొరల్లోకి ఇంకదు. బయో పిక్ అంటేనే ప్రధాన పాత్రతో ప్రేక్షకుడికి ఎమోషనల్ గా కనెక్షన్ కుదరాలి. ఈ సినిమాలో అది మిస్సయింది. అందుకే చివరిలో జార్జి రెడ్డి చనిపోయే సన్నివేశం వస్తున్నప్పుడు గుండెలు బరువెక్కడానికి బదులు సినిమా అయిపోయిందనే భావన వస్తుంది.

అలాగని ఈ సినిమాలో పెద్ద విషయం ఏమీ లేదనుకోవద్దు. కాలేజీ సన్నివేశాలు, యాక్షన్ ఘట్టాలు అందరినీ ఆకట్టుకునేలా ఉంటాయి. కొన్ని సన్నివేశాలకు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. 70 ల నాటి ఉస్మానియా వాతావరణాన్ని సైతం తెరపై అద్భుతంగా చూపించగలిగారు. కానీ జార్జి రెడ్డి జీవితాన్ని క్రమపద్ధతిలో వివరించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. ప్రతి సన్నివేశం అద్భుతంగానే ఉన్నప్పటికీ.. ఒకదానికొకటి కనెక్షన్ మిస్సయి సినిమా సింక్ అవ్వలేదు. ప్రథమార్థం బాగానే ఉన్నా.. ద్వితీయార్థం మాత్రం చాలా భారంగా గడుస్తుంది. వెరసి ఓ మిశ్రమానుభూతి సినిమాపై కలుగుతుంది. కానీ ఓ క్లాసిక్ సినిమా చూశామనే అనుభూతి కలగదు.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.