మత్తు వదలరా సినిమా రివ్యూ

కొత్త దర్శకుడు, కొత్త హీరో అయినా సరే కథలో విషయం ఉంటే ఆ సినిమాకు ప్రేక్షకాదరణ ఉంటుంది. దీనికి టాలీవుడ్ లో ఎన్నో ఉదాహరణలున్నాయి. మత్తు వదలరా సినిమా కూడా అలాంటిదే. వైవిధ్యమైన పోస్టర్లు, ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని బాగానే క్రియేట్ చేశాయి. అందులోనూ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించడం కూడా కాస్త హైప్ క్రియేట్ చేసింది. పైగా సంగీత దర్శకుడు కీరవాణి చిన్న కొడుకు ఈ సినిమాలో హీరో కావడం, పెద్ద కొడుకు సంగీత దర్శకుడిగా పనిచేయడంతో ఆ ఆసక్తి మరింత పెరిగింది. వైవిధ్యమైన కథతో క్రైమ్ కామెడీ సినిమాగా తెరకెక్కిన చిత్రం డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా విడుదలైంది. మరి ఈ చిత్రం అనుకున్న ఫలితాన్ని సాధించిందా? ప్రేక్షకులను ఆకట్టుకోగలిగిందా? చూద్దాం ఈ సినిమా ఎలా ఉందో..?

ఇదీ సినిమా కథ

కథానాయకుడు బాబూ మోహన్(శ్రీ సింహ) తన స్నేహితులు ఏసు(సత్య), అభి(నరేష్ అగస్త్య)తో కలసి ఓ కొరియర్ కంపెనీలో డెలివరీ బాయ్ గా పనిచేస్తుంటాడు. నెలంతా కష్టపడి పని చేసినా అతడికి వచ్చే జీతం నాలుగు వేలకు మించదు. ఈ విషయంలో బాబూ మోహన్ చాలా అసంతృప్తితో ఉంటాడు. తన కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కడం లేదని బాధపడిపోతుంటాడు. కానీ తన స్నేహితుడు ఏసు మాత్రం చాలా హ్యాపీగా ఉంటాడు. దానికి కారణం ఓ ట్రిక్ ప్లే చేస్తూ.. కస్టమర్లను ఏమార్చి డబ్బులు కాజేయడమే. అది చూసి అట్రాక్ట్ అయ్యి అదే బాటలో నడవడానికి రెడీ అయిపోతాడు శ్రీసింహ. అలా ఓ ముసలమ్మ నుంచి రూ. 500 కొట్టేసే ప్రయత్నం చేస్తాడు. ఆ ముసలమ్మ మరీ గడుసుది కావడంతో బాబూ మోహన్ చేసిన మోసాన్ని గుర్తిస్తుంది. ఆ సమయంలో జరిగిన చిన్న తోపులాటలో ఆమె చచ్చిపోతుంది. అక్కడి నుంచి అతడి జీవితం మలుపు తిరుగుతుంది. అనుకోకుండా ముసలమ్మ ఫ్లాట్ లో లాకైపోయిన బాబూమోహన్ మత్తులోకి జారుకుంటాడు. మర్నాడు నిద్ర లేచి చూస్తే మరో ఫ్లాట్లో ఉంటాడు. అక్కడ ఇంకో శవం ఉంటుంది. అక్కడి నుంచి భయపడి తన రూంకి పారిపోతాడు. తన బ్యాగులో 50 లక్షల రూపాయల డబ్బులుంటాయి. అసలు బాబూ మోహన్ ముసలమ్మ ఫ్లాట్ లో ఎందుకు లాక్ అయిపోయాడు? మరో ఫ్లాట్ లోకి ఎలా వెళ్లాడు? ఆ యాభై లక్షలు తన బ్యాగులో ఎవరు పెట్టారు? అనేదే ఈ సినిమా కథ.

విశ్లేషణ

దొంగతనం చేయడానికి ప్రయత్నించడం, దొరికిపోవడం, అప్పుడు జరిగిన గలాటాలో ఒకరు చనిపోవడం, అక్కడే నిద్రపోవడం, మర్నాడు ఇంకో ఫ్లాట్ లో నిద్ర లేవడం, ఎదురుగా మరో శవం.. ఈ లైన్ వింటే వరుస ట్విస్టులతో పాటు ఆసక్తిగా అనిపించడం ఖాయం. వాస్తవానికి ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఐడియా అనే చెప్పుకోవాలి. బహుశా అది నచ్చే కొత్తవాడైనప్పటికీ రితేష్ రాణాకు దర్శకుడిగా అవకాశం ఇచ్చి ఉంటారు నిర్మాతలు. వినడానికి బాగానే ఉన్నప్పటికీ తెరకెక్కించడంలో ఎంత వరకు సఫలమయ్యారన్నదే ఇక్కడి ప్రశ్న.

హీరో కష్టాలతో తెరపై కథ చాలా స్లోగా మొదలయ్యి సీరియస్ గా సాగిపోతుంటుంది. మధ్యలో టీవీ సీరియల్ కామెడీ, మోసం ఎలా చేయాలో బాబూ మోహన్ కి ఏసు చెప్పే క్లాసులతో సినిమా కాస్త నెమ్మదిగానే ఉంటుంది. ముసలమ్మ మరణంతో కథ ఊపందుకుంటుంది. హీరో ఓ ఫ్లాట్ లో లాక్ అయిపోతాడు. అక్కడి నుంచి బయటపడటానికి హీరో చేసే ప్రయత్నాలు తెరపై చాలాసేపే కనిపిస్తాయి. అదే సమయంలో హీరో భ్రమల్లోకి స్నేహితుల పాత్రలను తీసుకొచ్చి కామెడీ పండించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఫస్టాఫ్ లో ఈ కామెడీ బాగా వర్కవుట్ అయింది. ముడి మీద ముడి వేసి నెక్స్ట్ ఏం జరుగుతుందనే ఆసక్తిని క్రియేట్ చేయగలిగాడు. అలా మొదటి అర్థ భాగం ముగుస్తుంది.

తొలి భాగంలో కథ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్న దర్శకుడు ద్వితీయార్థానికి వచ్చేసరికి కాస్త తడబడ్డాడు. చిక్కు ముడులు వేయడంలో సక్సెస్ అయిన దర్శకుడు వాటిని విప్పే విషయంలోమాత్రం ఫెయిలయ్యాడు. వాటిని విప్పడానికి కథను సైడ్ ట్రాక్ ఎక్కించాడు. ఎవరికీ తెలియకుండా ఓ ఫ్లాట్లో గంజాయి మొక్కలు పెంచడం, వాటిని రహస్యంగా రవాణా చేయడం లాంటి సీన్లు చాలా సత్యదూరంగా కనిపిస్తాయి. ఉన్న చిక్కుముడులకు తోడు కొత్త డౌట్లు వస్తుంటాయి. అప్పటి వరకు చాలా గొప్పగా అనిపించిన సినిమా కథ.. ఇదేంటి రొటీన్ కథలా మారిపోయింది అనిపిస్తుంది. క్లైమాక్స్ అయితే మరీ కామెడీగా ఉంటుంది. తొలి భాగంలో సినిమా గొప్పగా తీశాడ్రా అనిపించిన దర్శకుడు మలిభాగానికి వచ్చేసరికి పెదవి విరిచేలా చేస్తాడు.

నటీనటులు

కథానాయుడు శ్రీ సింహాకు ఇదే మొదటి సినిమా. అయినా తన హావభావాలతో పాత్రను రక్తి కట్టించాడు. చాలా నేచురల్ గా, చక్కటి ఈజ్ తో నటించాడు. గడ్డంతో ఉన్నంత సేపు ముఖంలో భావాలేమీ కనిపించలేదు. కానీ ఆ గడ్డం తీసేశాక మాత్రం అద్భుతంగా చేస్తున్నాడనిపించాడు. సత్య మరోసారి తన కామెడీ విశ్వరూపాన్ని చూపించాడు. ప్రథమార్థం అంతా సత్య దున్నేశాడు. నరేష్ అగస్త్య కూడా చక్కగా నటించాడు. ఈ జూనియర్ షెర్లాక్ గా నరేష్ ప్రేక్షకులకు గుర్తుండి పోతాడు.

సాంకేతిక వర్గం

సాంకేతిక వర్గం గురించి చెప్పుకోవాలంటే.. మనం మొదట ప్రస్తావించుకోవాల్సింది సంగీత దర్శకుడు కాలభైరవ గురించి. కీరవాణి వారసుడిగా సినీ సంగీత ప్రపంచంలో అడుగుపెట్టిన కాలభైరవ మత్తు వదలరా సినిమాకు మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. కథలో ఇన్వాల్య్ అయ్యేలా సంగీతం సమకూర్చాడు. కెమెరా పనితనం బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా తెరపై రిచ్ గా కనిపిస్తుంది. తొలిభాగంలో స్క్రీన్ ప్లే చాలా బాగుంది. సెకెండాప్ లో కూడా అలాగే ఉంటే బాగుండేదనిపించింది. కొన్ని ట్విస్టులు, కామెడీ, మంచి కథతో ఫర్వాలేదనిపించేలా సినిమా ఉంటుంది.

రేటింగ్ 2.75/5

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.