అల వైకుంఠపురములో సినిమా రివ్యూ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమ అల వైకుంఠపురములో. ఈ ఇద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి మంచి హిట్లుగా నిలిచాయి. ఇప్పుడు ఈ ఇద్దరి కలయికలో మూడో సినిమా వస్తోందంటే.. టాలీవుడ్ తో పాటు.. సినీ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూశారు. పైగా ఈ కాంబినేషన్ పై అంచనాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. పాటలు, టీజర్, ట్రైలర్ బాగా ఆకట్టుకోవడంతో.. ఆ అంచనాలు మరింత పెరిగాయి. మరి బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అల వైకుంఠపురములో హ్యాట్రిక్ హిట్ అందుకుందా? లేదా?

కథేంటంటే..

రామచంద్ర (జయరాం) కంపెనీలో క్లర్కుగా పనిచేస్తుంటాడు వాల్మీకి(మురళీశర్మ). తనలాగా క్లర్కుగా పనిచేసే రామచంద్ర సంస్థ యజమాని కూతురుని పెళ్లి చేసుకుని పెద్ద స్థాయికి చేరుకోవడం వాల్మీకికి రుచించదు. ఆ అక్కసుతోనే రామచంద్ర కొడుకు స్థానంలో తన కొడుకుని ఉంచి.. అతని కొడుకును తన కొడుకుగా పెంచుతాడు(ఇద్దరూ ఒకే ఆసుపత్రిలో ఒకే సమయంలో పుడతారు). ఆ పిల్లాడికి బంటు(అల్లు అర్జున్) అని పేరు పెట్టి ప్రేమ అన్నదే చూపించకుండా పెంచుతాడు. అతడి ప్రవర్తనతో విసిగి వేసారిపోతాడు బంటు. పరిస్థితుల ప్రభావం వల్ల మళ్లీ తన కన్నతండ్రి దగ్గరకే చేరుకుంటాడు. అక్కడ బంటుకి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? తన పుట్టుకకు సంబంధించిన నిజం బంటుకి ఎలా తెలిసింది? ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదుర్కున్నాడన్నదే సినిమా కథ.

Advertisements

విశ్లేషణ

రాజు ఎక్కడున్నా రాజే అనే కాన్సెప్టుతో తెరకెక్కిన సినిమా ఇది. సినిమా చాలా సింపుల్ గా ఉంటుంది. ఒక సినిమాలో ఉండాల్సిన అన్ని అంశాలు సమపాళ్లలో ఉన్నాయి. కామెడీ, ఎమోషన్, రొమాన్స్, హీరోయిజం అన్నీ ఎంత వరకు ఉండాలో అంతవరకే ఉన్నాయి. అజ్ఞాతవాసి తర్వాత రూట్ మార్చిన త్రివిక్రమ్ ఈ సినిమాలో ప్రాస పంచులను, వ్యక్తిత్వ వికాస తరగతులను పక్కన పెట్టేశాడు. కథకు తగ్గ సన్నివేశాలు, మాటలతో సినిమాను ముందుకు నడిపించాడు.

ఆరంభంలోనే కీలకమైన మలుపుతో సినిమా మొదలవుతుంది. అది సినిమా ఎలా సాగుతుందనే క్యూరియాసిటీని కలిగిస్తుంది. హీరో ఎంట్రీ తర్వాతా సినిమా ఎంటర్టైనింగ్ గా మారిపోతుంది. త్రివిక్రమ్ మాటల పదునుకి బన్నీ ఫెర్మార్మెన్స్ తోడవుతుంది. బంటు పాత్రకి ప్రేక్షకులు బాగా కనెక్టవుతారు. మురళీశర్మ, బన్నీ మధ్య వచ్చే సన్నివేశాలు, వారి మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. హీరోయిన్ తో రొమాన్స్ కూడా సరదాగా సాగిపోతుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే మరో కీలకమైన మలుపు ప్రేక్షకుల్లో తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ కలిగిస్తుంది.

ద్వితీయార్థంలో ఎంటర్టైన్మెంట్ పీక్స్ కి చేరుకుంటుంది. బోర్డ్ రూం మీటింగ్ లో బన్నీచేసే హడావుడి ఓ రేంజ్ లో ఉంటుంది. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు పాటలకు బన్నీ డ్యాన్స్ చేసే సీన్ అందరినీ అలరిస్తుంది. విలన్ ఎంట్రీతో సినిమా మరో రేంజ్ కి వెళ్లిపోతుంది. క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ కూడా చాలా క్లాస్ గా ఉంటుంది. ఎండ్ టైటిల్స్ పడే ముందు కూడా త్రివిక్రమ్ మార్క్ కామెడీతో ముగుస్తుంది. థియేటర్ నుంచి ప్రేక్షకుడు హాయిగా నవ్వుకుంటూ బయటకు వస్తాడు. ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్న సినిమాలో కొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి. త్రివిక్రమ్ గత సినిమాల్లో మాదిరిగా కామెడీ కడుపుబ్బ నవ్వించదు. కానీ చివరి వరకు ఎంగేజ్ చేస్తుంది. సినిమా నెరేషన్ కాస్త స్లోగా ఉండటమూ మైనస్ పాయింటే.

Advertisements

నటీనటులు

తన కెరీర్లో ఇంత బాగా ఏ పాత్రను ఎంజాయ్ చేయలేదని అల్లు అర్జున్ ప్రచార కార్యక్రమాల్లో చెప్పుకొచ్చాడు. నిజంగానే బంటూ పాత్రలో బన్నీ చాలా కూల్ గా కనిపిస్తాడు. నిజానికి అతని కెరీర్లో ఇదే బెస్ట్ పాత్ర అని చెప్పుకోవచ్చు. ఎక్కడా అతి చేయకుండా.. చాలా సరదాగా చేసుకుంటూ వెళ్లిపోయాడు. ఎమోషన్ సీన్లలో కూడా బాగా నటించాడు. డ్యాన్స్ విషయంలో ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బన్నీ తర్వాత ఎక్కువ ప్రాధాన్యమున్న పాత్ర మురళీ శర్మదే. వాల్మీకి పాత్ర ఎదురుగా ఉంటే.. లాగి రెండు కొట్టాలనిపిస్తుంది. అంత నేచురల్ గా నటించాడు. పూజా హెగ్డే తెరపై చాలా అందంగా కనిపించింది. మొదట్లో ఆమె పాత్ర బాగుందనిపించినా.. తర్వాత తేలిపోతుంది. జయరాం కూడా చాలా బాగా చేశారు. టబుకి హైప్ ఇచ్చినంత గొప్ప పాత్రేమీ దక్కలేదు. సముద్రఖని, జీపీ విలన్గా ఓకే అనిపించారు. హర్షవర్థన్ కి మంచి పాత్ర లభించింది. వెన్నెల కిషోర్, రాజేంద్రప్రసాద్, నివేథా పెతురాజ్, సునీల్, నవదీప్ కూడా ఓకే.

సాంకేతిక వర్గం

ఆది నుంచీ ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయంటే దానికి కారణం థమన్ అందించిన సంగీతమే. తొలి పాట సామజవరగమనా విడుదలైనప్పటి నుంచి ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. రాములో రాములా, బుట్టబొమ్మా పాటలతో ఆ అంచనాలు మరింత పెరిగాయి. వినడానికి మాత్రమే కాదు.. చూడటానికి కూడా ఈ పాటలు చాలా అందంగా ఉంటాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా అదరగొట్టాడు థమన్. సందర్భానికి తగ్గ మ్యూజిక్ తో సినిమా వ్యాల్యూను పెంచేశాడు. త్రివిక్రమ్ రాసుకున్న కథ ఏమంత గొప్పగా లేదు. రొటీన్ కథే. కానీ.. కథనం అద్భుతంగా ఉండటంతో.. సినిమా ఆసాంతం గొప్పగా అనిపిస్తుంది. తన మార్కు మాటలతో ప్రేక్షకుడిని కట్టి పడేశాడు. తెరపై ప్రతి పాత్రకు ప్రాధాన్యం కల్పించాడు. త్రివిక్రమ్ కెరీర్లో ఈ సినిమా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ గురించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. గీతా ఆర్ట్స్, హారికహాసిని బ్యానర్ కి తగ్గట్టుగా చాలా రిచ్ గా, కథకి తగ్గట్టుగా ఉన్నాయి. పి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. తెరపై విజువల్స్ చాలా అందంగా ఉన్నాయి. నవీన్ నూలి ఎడిటింగ్ బాగానే ఉంది కానీ.. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలకు కాస్త కత్తెర వేసుంటే.. సినిమా మరింత బాగుండేది. అయితే త్రివిక్రమ్ ప్రతి విషయంలోనూ సమతూకం పాటించడం వల్ల అల వైకుంఠపురములో సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.

రేటింగ్: 3.25/5

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.