అశ్వత్థామ సినిమా రివ్యూ

ఊహలు గుసగులాడే సినిమాతో లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు నాగశౌర్య. కానీ ఆ తర్వాత చెప్పుకోదగ్గ హిట్లు ఏమీ అందుకోలేదు. ఛలో సినిమాతో తనే నిర్మాతగా మారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ఆ విజయాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. ఇప్పుడు మళ్లీ హిట్ అందుకోవాలనే కసితో.. అశ్వత్థామ అనే మాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు నిర్మాతగా మాత్రమే కాదు.. తానే స్వయంగా కథను కూడా రాశాడు. రమణ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి నాగశౌర్య ఆశించినంత మేర సినిమా విజయం సాధించిందా.. చూద్దాం.

కథేంటంటే..

చిన్నప్పటి నుంచి తన చెల్లెలిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాడు గణ(నాగశౌర్య). గణకి చెల్లెలంటే పంచ ప్రాణాలు. ఆమెకు పెళ్లి కుదరడంతో అమెరికా నుంచి ఇండియాకు వస్తాడు. నిశ్చితార్థం పూర్తయిన తర్వాత గణ చెల్లి ఆత్మహత్యా ప్రయత్నం చేస్తుంది. ఆమెను సముదాయించి అసలు విషయం తెలుసుకుని షాకవుతాడు. తన చెల్లెలు గర్భం దాలుస్తుంది. దానికి కారణమెవరో ఆమెకి కూడా తెలియదు. తనకు తెలియకుండా.. ప్రెగ్నెంట్ ఎలా అయిందనే మిస్టరీని ఎలా చేధించాడు? ఈ ప్రయాణంలో ఎదురైన సవాళ్లను ఎలా ఎదిరించాడు? అనేదే ఈ సినిమా కథ.

విశ్లేషణ

ప్రచార కార్యక్రమాల్లో అశ్వత్థామ చాలా మంచి సినిమా అని చెప్పుకుంటూ వచ్చాడు నాగశౌర్య. పైగా సినిమా పేరుని గుండెలపై పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. నాగశౌర్య చెప్పినట్టుగానే సినిమా లైన్ కూడా బాగానే ఉంది. అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడే దుర్మార్గుడిని వెతికి పట్టుకోవడం ఈ సినిమా స్టోరీ లైన్. కానీ దాన్ని సక్రమంగా తెరకెక్కించడంలో కాస్త తడబడ్డారేమో అనిపిస్తుంది. సైకో థ్రిల్లర్ సినిమాలు ఇష్టంగా చూసేవారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. మిస్టరీతో సినిమాపై క్యూరియాసిటీ కలిగేలా చేశారు. చాలా సాధారణంగా మొదలైన సినిమా చెల్లెలు గర్భం ధరించిందని తెలియడంతో అసలు కథలోకి ఎంటరవుతుంది. ఆ సన్నివేశంలో నాగశౌర్య ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. ఆ తర్వాత జాలర్ల ముఠాను పట్టుకోవడంతో కథ ఊపందుకుంటుంది. ఇలా మొదటి భాగం చాలా ఉత్కంఠగా సాగిన సినిమా.. రెండో అర్థ భాగానికి వచ్చే సరికి చప్పబడిపోతుంది. విలన్ ఎవరో ద్వితీయార్థం మొదట్లోనే తెలిసిపోవడంతో సినిమాపై ఆసక్తి తగ్గిపోతుంది. ఒక సన్నివేశానికి మరో సన్నివేశానికి లింక్ చేయడంతో దర్శకుడు కాస్త తడబడ్డాడు. చివరిగా హీరో విలన్ స్థావరంలోకి వెళ్లి.. అతడి ఆగడాలకు పుల్ స్టాప్ పెట్టేస్తాడు.

వాస్తవానికి ఇదో థ్రిల్లర్ సినిమా. కానీ దీనికి సెంటిమెంట్ జోడించారు. కానీ ఆ సెంటిమెంట్ ను సరిగ్గా పండిచలేకపోయారు. కొన్ని సన్నివేశాలను చూస్తే ఒళ్లు గగుర్పొడిచేంత దారుణంగా ఉంటాయి. వాటిని ఆడపిల్లల తల్లిదండ్రులు తెరపై చూడలేరు. వాస్తవానికి అలాంటి సన్నివేశాలు తల్లిదండ్రుల్లో భయాన్ని కలిగిస్తాయి. సినిమా అంతా హీరో గొప్పతనం, విలన్ శాడిజం చుట్టూనే తిరగడం వల్ల ఈ సినిమా అందరికీ ఎక్కకపోవచ్చు. ముఖ్యంగా మహిళలు, కుటుంబ కథా సినిమా ప్రేక్షకులు, కాస్త సాఫ్ట్ మైండెడ్ పీపుల్ ఈ సినిమాలో సన్నివేశాలను, విలన్ శాడిజాన్ని జీర్ణించుకోలేకపోవచ్చు.

నటీనటులు

నాగశౌర్య పూర్తి స్థాయి మాస్ తరహా పాత్రను చేయడం ఇదే మొదటిసారి. అతని మ్యానరిజమ్స్ ఈ పాత్రకు తగ్గట్టుగా ఉన్నాయి. చెల్లెలికి జరిగిన అన్యాయంపై ప్రతీకారంతో రగిలిపోయే అన్నలా బాగా నటించాడు. హీరోయిన్ మెహ్రీన్ కౌర్ పాత్ర గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. నామమాత్రంగానే ఉంటుంది. విలన్ తెలుగు తెరకు కొత్తవాడు. కానీ బాగా మెప్పించాడు. మిగిలిన వారి పాత్రల గురించి పెద్దగా చెప్పుకోవడానికి లేదు. వారికి తెరపై స్కోప్ అంతకంటే లేదు.

సాంకేతిక వర్గం

సాంకేతిక వర్గం గురించి చెప్పుకోవాల్సి వస్తే.. మనం మొదట ప్రస్తావించాల్సింది సంగీత దర్శకుడు శ్రీ చరణ్ గురించే. శ్రీ చరణ్ పాటలు అంత గొప్పగా ఏమీ లేవు. సినిమాలో వాటికి ప్రాధాన్యం కూడా ఏమీ లేదు. కానీ.. బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం అద్భుతంగా ఇచ్చాడు. నిర్మాణ విలువల విషయంలో నాగశౌర్య అండ్ ఫ్యామిలీ ఎక్కడా రాజీ పడలేదు. నాగశౌర్య కూడా చాలా మంచి కథను అందించాడు. రమణ తేజ కూడా సినిమాను బాగానే తెరకెక్కించినప్పటికీ.. స్క్రీన్ ప్లే సరిగ్గా లేకపోవడం వల్ల సెంటిమెంట్, థ్రిల్ మధ్య కో ఆర్డినేషన్ మిస్సయింది. మరో మాటలో చెప్పాలంటే.. రమణ దర్శకత్వం ఓకే అనిపించేలా ఉంది.

రేటింగ్ – 2.25

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.