హిట్ సినిమా రివ్యూ

నేచురల్ స్టార్ నాని ప్రొడ్యూస్ చేసిన సినిమా ‘హిట్’. గతంలో నాని నిర్మాతగా వచ్చిన సినిమా ‘అ’ మంచి ప్రశంసలు దక్కించుకుంది. దీంతో హిట్ సినిమాపై కూడా అంతే స్థాయిలో అంచనాలున్నాయి. ఫలక్నుమా దాస్ తో హిట్ అందుకున్న విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించడం, టీజర్, ట్రైలర్లు ఆకట్టుకోవడంతో ఆ అంచనాలు మరింత పెరిగిపోయాయి. మరి ఈ హిట్ సినిమా సూపర్ హిట్ గా నిలిచిందా? చూద్దాం.. ఎంత మేర ఆకట్టుకుందో..

కథేంటంటే..

విక్రమ్(విశ్వక్ సేన్) ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా హొమిసైడ్ ఇంటర్వెన్షన్ టీం(హిట్)లో బాధ్యతలు నిర్వహిస్తుంటాడు. అయితే ఇతనికి పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ ఉంటుంది. అంటే గతం తాలూకు అనుభవాల వల్ల ఏర్పడిన మానసికపరమైన సమస్య. దీంతో కొంత కాలం పాటు విధుల నుంచి విరామం తీసుకోక తప్పని పరిస్థితి ఎదురవుతుంది. మరోవైపు ప్రీతి అనే అమ్మాయి కిడ్నాప్ కేసును ఇన్వేస్టిగేట్ చేసే క్రమంలో నేహ(రుహానా శర్మ) అనే పోలీసాఫీసర్ కూడా అపహరణకు గురవుతుంది. దీంతో మళ్లీ తన ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు. నేహ ఎందుకు కిడ్నాప్ అయ్యింది? ఆ కేసుని విక్రమ్ ఛేదించగలుగుతాడా? తనకున్న మానసిక సమస్యను ఎలా అధిగమించగలిగాడు? ఇవన్నీ తెలియాలంటే.. తెరపై సినిమాను చూడాల్సిందే.

విశ్లేషణ

హిట్ సినిమా కథలో కొత్తదనం ఏమీ లేదు. కానీ సినిమా అంతా చాలా ఫ్రెష్ గా ఉంటుంది. అదెలా సాధ్యం? ఇన్వెస్టిగేషన్ చూపించే విధానం, కథనం, ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేసిన విధానం, సాంకేతికపరమైన అంశాలు ఈ సినిమాను సరి కొత్తగా మార్చేశాయి. ముఖ్యంగా కథనంతో ప్రేక్షకులను కట్టిపడేశాడు దర్శకుడు శైలేష్ కొలను. సాధారణంగా సస్పెన్స్ సినిమా అంటే ట్విస్టుల మీద ట్విస్టులతో తెరకెక్కిస్తుంటారు. కానీ హిట్ సినిమా విషయంలో అనవసరమైన ట్విస్టుల జోలికి పోలేదు. ఆ ట్విస్టులకు బదులుగా.. కథనంలో వాస్తవికతకు పెద్ద పీట వేశారు. అసలు ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది? ఆ క్రమంలో ఎదురయ్యే సవాళ్లేంటి? అనే విషయాలకే పెద్ద ప్రాధాన్యమిచ్చారు. సాధారణంగా తెర మీద పోలీస్ లేదా ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పాత్రలో కథానాయకుడు కనిపిస్తున్నాడంటే.. పూర్తిగా పాజిటివ్ గానే చూపిస్తారు. కానీ దానికి భిన్నంగా ఓ సైకలాజికల్ డిజార్డర్ తో ఇబ్బంది పడే అధికారిగా విశ్వక్ సేన్ ను చూపించారు. దీన్ని విశ్వక్ సేన్ చాలా బాగా హ్యాండిల్ చేశాడనే చెప్పుకోవాలి. ఆరంభంలోనే క్లూస్, సాక్ష్యాలు వెతికిపట్టుకోవడంలో విక్రమ్ ప్రతిభ ఎంత గొప్పదో నీట్ గా ప్రజెంట్ చేశాడు దర్శకుడు. అలాంటి ఆఫీసర్ ఎలాంటి క్లూ లేని కేసు డీల్ చేస్తే ఎలా ఉంటుంది? తనకు దొరికిన ఒక్కొక్క క్లూని పట్టుకుని కేసుని ఎలా క్లోజ్ చేశాడు? అన్న పాయింట్ మీదే కథ నడిచింది. మొదటి భాగమంతా ఎలాంటి ట్విస్టులు లేకుండా చాలా సాఫీగా ముందుకు సాగిపోతుంది. సెకండాఫ్ మొదలయ్యేసరికి విక్రమ్ లో ఉన్న డిజార్డర్ బయటపడటం మొదలవుతుంది. అక్కడి నుంచి కథ చాలా ఇంటరెస్టింగ్ గా మారుతుంది. మధ్యలో నేహ కిడ్నాప్ కథతో మరింత ఆసక్తి పెరుగుతుంది. దీని తర్వాత కథలో కొంచెం ఇంటెన్సిటీ తగ్గినట్టనిపిస్తుంది. ఎందుకంటే.. ఇక్కడ కథ కంటే టెక్నికల్ విషయాలకు ప్రాధాన్యమిచ్చాడు దర్శకుడు. కానీ క్లైమాక్స్ కి ముందు వచ్చే సన్నివేశాలు మాత్రం షాక్ తో పాటు థ్రిల్ ను కూడా పంచుతాయి. అందుకే థియేటర్ నుంచి వచ్చే ప్రేక్షకుడికి మంచి థ్రిల్లర్ సినిమా చూశాననే ఫీలింగ్ కలుగుతుంది.

నటీనటులు

సైకలాజికల్ డిజార్డర్ ఉన్న సిన్సియర్ పోలీసాఫీసర్ గా విశ్వక్ సేన్ అద్భుతంగా నటించాడు. ఈ పాత్రలో విశ్వక్ సేన్ తప్ప మరొకరిని మనం ఊహించుకోలేం. ఓ వైపు డ్యూటీ మరోవైపు మానసిక సంఘర్షణ రెండూ కలగలిసిన భావాలను ముఖంలో పలికించాడు. తనలోని నటుడికి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం. అంత గొప్పగా విక్రమ్ పాత్రలో లీనమయ్యాడు. రుహానీ శర్మ పేరుకే హీరోయిన్ కానీ.. ఆమెకు ఈ సినిమాలో అంత ప్రాధాన్యం ఏమీ లభించలేదు. అయినా.. తన పరిధి మేరకు బాగానే నటించింది. మురళీశర్మ, భానుచందర్, బ్రహ్మాజీ వారి పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. హరితేజ పాత్ర మరింత బాగా తీర్చిదిద్ది ఉంటే బాగుండేది.

సాంకేతిక వర్గం

థ్రిల్లర్ లేదా సస్పెన్స్ సినిమాకు కథతో పాటు దానికి తగిన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా చాలా అవసరం. అప్పుడే ఆ సస్పెన్స్ చివరి వరకు క్యారీ అవుతుంది. ఈ సినిమాలో బ్యాగ్రౌండ్ స్కోర్ రొటీన్ కి భిన్నంగా ఉంటుంది. అక్కడక్కడా మినహాయిస్తే.. సంగీతం ఈ సినిమాకు ప్లస్ గా నిలిచింది. ఈ విషయంలో సంగీత దర్శకుడు వివేక్ సాగర్ ని మెచ్చుకోవాల్సిందే. మణికందన్ ఛాయాగ్రహణం బాగుంది. కథలో ఉన్న లోతును తన కెమెరా ద్వారా చక్కగా చూపించగలిగాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. శైలేష్ కొలను ఈ సినిమా కోసం నిశితమైన పరిశోధన చేసినట్టున్నారు. ఆ విషయం తెరపై స్పష్టంగా కనిపిస్తోంది. టెక్నికల్ విషయాల్లోనూ మంచి అవగాహన ఉంది. మధ్యలో కొంత కథ పక్కకు వెళ్లినట్టనిపించినా.. తన మొదటి సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు శైలేష్ కొలను.

రేటింగ్: 3/5

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.