పలాస 1978 సినిమా రివ్యూ

గత కొంత కాలంగా సోషల్ మీడియాను గమనిస్తే.. టాలీవుడ్ ప్రముఖుల్లో చాలామంది పలాస 1978 సినిమా గురించి ప్రస్తావిస్తూ వస్తున్నారు. సినిమా చాలా అద్భుతంగా ఉందని పోస్టులు పెడుతున్నారు. దానికి తగినట్టుగానే ట్రైలర్లు, పాటల ప్రోమోలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. యదార్థంగా జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా కరుణకుమార్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించాడు. తొలి సినిమాతోనే టాలీవుడ్ ప్రముఖుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేర మెప్పించిందో చూద్దాం

కథ

శ్రీకాకుళం జిల్లా పలాస కు చెందిన మోహన్ రావు(రక్షిత్) వెనుకబడిన వర్గానికి చెందిన కుర్రాడు. అగ్రవర్ణాలకు చెందిన వారు తమపై చూపించే ఆధిపత్యం అతనికి నచ్చదు. వారి వల్ల తన అన్నకు అన్యాయం జరుగుతుంది. దీంతో వారిపై పగ పెంచుకుంటాడు. ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. ఆ క్రమంలోనే షావుకారు కొడుకుని కొడతాడు. అలా గొడవ పెరిగి పెద్దదవుతుంది. మోహన్ రావు గూండాగా మారిపోతాడు. అక్కడి నుంచి అతడి జీవితం అనుకోని మలుపులు తిరుగుతూ ఉంటుంది. ప్రతిరోజూ చావుబతుకుల మధ్య అతని రోజు గడిచిపోతుంటుంది. ఈ ప్రయాణంలో అతనికి ఎలాంటి నష్టం జరిగింది? తనకు జరిగిన నష్టాన్ని పూడ్చుకోగలిగాడా? తన ప్రతీకారాన్ని ఎలా తీర్చుకున్నాడు? అనేదే ఈ సినిమా కథ.

విశ్లేషణ

తెలుగులో కమర్షియల్ హంగులు లేకుండా వాస్తవాన్ని వాస్తవంగా తెరకెక్కించే ప్రయత్నం చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటి ప్రయత్నమే పలాస 1978 సినిమా విషయంలో జరిగింది. కొన్ని దశాబ్దాల క్రితం అగ్రవర్ణాల అహంకారానికి, ఆధిపత్యానికి బలైపోయిన ఓ కుటుంబం కథ ఇది. దాన్ని చాలా సిన్సియర్ గా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు కరుణకుమార్. సాధారణంగా ఉత్తరాంధ్ర యాసను కామెడీ కోసం సినిమాల్లో వాడే ప్రయత్నం చేస్తారు తప్ప.. అక్కడ సంస్కృతిని చెప్పే ప్రయత్నం ఇంతవరకూ ఎవరూ చేయలేదు. మొదటిసారి అక్కడి వాతావరణాన్ని, వ్యవహారాలను తెరపై గొప్పగా చూపించగలిగారు. నాలుగు దశాబ్దాల క్రితం పలాస ఎలా ఉండేదో చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. తమ పబ్బం గడుపుకోవడానికి చిన్న కులాల వారిని పెద్ద కులాల వారు ఎలా వాడుకునేవారనేదాన్ని చూపించడంలో దర్శకుడి పరిణతి తెలుస్తుంది. శ్రీకాకుళం వాతావరణాన్ని అద్భుతంగా తెరపై ఆవిష్కరించిన కరుణకుమార్.. కథ, కథనాల విషయంలో కాస్త తడబడ్డాడనే చెప్పుకోవాలి. కథ ఆరంభంలో చాలా గొప్పగా అనిపిస్తుంది. కానీ కొంత సమయం గడిచేసరికి తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తి తగ్గిపోతుంది. ఈ విషయంలో కాస్త శ్రద్ధ వహించి ఉంటే.. సినిమా అన్ని వర్గాలకు చెందిన ప్రేక్షకులను మెప్పించి ఉండేది.

ఎవరెలా చేశారంటే..

ఏ సినిమా అయినా మనం మొదట హీరో గురించి చర్చించుకుంటాం. కానీ ఇక్కడ విలన్ గురించి మాట్లాడుకుంటే బాగుంటుందనిపిస్తుంది. గాయకుడిగా, సంగీత దర్శకుడిగా మనందరికీ సుపరిచితమైన రఘు కుంచె ఈ సినిమాలో విలన్. చిన్న షావుకారు పాత్రలో అదరగొట్టేశాడు. టాలీవుడ్ కి రఘు కుంచె రూపంలో కొత్త విలన్ దొరికాడు. హీరోగా చేసిన రక్షిత్ కూడా బాగా నటించాడు. తన నటనతో పాత్రకు ప్రాణం పోశాడు. ఇక హీరో అన్నగా చేసిన తిరువీర్, హీరోయిన్ నక్షత్ర, ఇతర పాత్రధారులందరూ అద్భుతంగా, సహజంగా నటించారు.

సాంకేతిక వర్గం

ఈ సినిమాకు రఘు కుంచే సంగీత దర్శకుడు. అలనాటి శ్రీకాకుళం జానపదాలను ఈ తరానికి మరోసారి పరిచయం చేశాడు. చక్కటి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇచ్చాడు. ఆనాటి పలాస వాతావరణాన్ని ప్రతిబింబించేలా సెట్స్ వేసిన ఆర్ట్ డైరెక్టర్ ను, దాన్ని తెరపై చూపించిన కెమెరా మెన్ ను కూడా మెచ్చుకోవాల్సిందే. దర్శకుడు తొలి ప్రయత్నంలోనే క్లాసిక్ సినిమా ఎంచుకోవడం గొప్పవిషయమే. ప్రతి సన్నివేశాన్ని ఆసక్తికరంగా చూపించగలిగాడు. కొన్ని సన్నివేశాల్లో దర్శకుడిగా అతని పరిణతిని సైతం మెచ్చుకోవాల్సిందే. కానీ కథ, కథనం విషయాల్లో ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది.

రేటింగ్: 2.75/5

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.