కరోనా కష్టకాలంలో ఆహారం భద్రంగా..

ప్రస్తుతం మనందరం కరోనా కష్టకాలంలో ఉన్నాం. ఎక్కువ సమయం ఇంట్లోనే గడుపుతున్నాం. లాక్ డౌన్ నేపథ్యంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. పైగా కరోనా వల్ల ఏర్పడిన భయం కారణంగా బయటకు వెళ్లడం కూడా తగ్గించేశాం. ఈ నేపథ్యంలో నిత్యావసరాల విషయంలో మనం కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పని పరిస్థితి. ఎక్కడికక్కడ రవాణా వ్యవస్థ స్థంభించిపోవడం వల్ల నిత్యావసరాలకు కొరత ఏర్పడే అవకాశం ఉంది. సూపర్ మార్కెట్లు, కిరాణాదుకాణాలు, పాల బూత్ లు రైతు బజార్లు అన్నీ అందుబాటులోనే ఉన్నప్పటికీ.. ప్రభుత్వాలు రేషన్ షాపుల ద్వారా ప్రజలకు అవసరమైన సరుకులు సరఫరా చేస్తున్నప్పటికీ.. మనం వాటిని జాగ్రత్తగా వాడుకోకపోతే.. ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. ఆహారం కొరత ఎదుర్కోవాల్సి రావచ్చు. మనం కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ కూరగాయలు, ఇతర నిత్యావసరాలను భద్రపరుచుకోవడం ద్వారా ఆ ప్రభావం మీపై పడకుండా చూసుకోవచ్చు. దానికోసం ఏం చేయాలో చూద్దాం.

కూరగాయలు ఇలా..

క్వారెంటైన్ పీరియడ్లో రైతు బజార్లు తెరిచే ఉంచుతున్నారు. అయితే రైతు బజార్లకు కూడా కరోనా సెగ తగిలింది. అందుకే అక్కడ కూడా లభించే కాయగూరలు కూడా తక్కువే ఉంటున్నాయి. అయితే ఉన్నవాటిలోనే ఎక్కువ కాలం నిల్వ ఉండే వాటిని తెచ్చిపెట్టుకోవడం ద్వారా కొంత కాలం ఇబ్బంది లేకుండా గడిపేయచ్చు. బంగాళాదుంప, ఉల్లి, క్యాబేజీ, బీట్రూట్, క్యారెట్, చిలగడదుంప, ముల్లంగి ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. వీటిని కొంచెం ఎక్కువ మొత్తంలో తెచ్చి పెట్టుకోవడం ద్వారా కొంత కాలం ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు.

ఆకుకూరలు, టమాట, బీన్స్ ఇలాంటి వాటిని మనం ఎక్కువగా కూరల్లో ఉపయోగిస్తుంటాం. ప్రస్తుతానికైతే.. టమాట, బీన్స్ రెండూ.. మార్కెట్లో బాగానే దొరుకుతున్నాయి. కానీ ఆకుకూరలు మాత్రం చాలా తక్కువగా ఉంటున్నాయి. వాటిని ముందుగానే మనం కొని నిల్వ చేసుకోవచ్చు. అలాగని వాటిని ఫ్రిజ్ లో పెట్టి ఉంచితే.. అవి బూజు పట్టిపోయే అవకాశం ఉంది. పాలకూర, తోటకూర, ఉల్లికాడలు, కొత్తిమీర తదితర ఆకుకూరల చివరలను రెండు రోజులకోసారి ట్రిమ్ చేస్తూ ఉండాలి. కూరగాయలను ఫ్రిజ్లో పెట్టే ముందు.. వాటిని శుభ్రంగా కడిగి పూర్తిగా ఆరిన తర్వాత ఫ్రిజ్లో పెట్టాలి.

మాంసాహారమైతే ఇలా..

మాంసం కూడా మనం కొన్ని రోజుల పాటు ఫ్రిజ్లో నిల్వ చేసుకోవచ్చు. కొంతమందికి మాంసం, చేపలు, రొయ్యలు వంటి వాటిని ఎండబెట్టి నిల్వ చేసుకుంటారు. మీకు వీలుంటే.. ఇప్పుడు కూడా అలా చేసుకోవచ్చు. అలా చేయడం కుదరదనుకుంటే.. రొయ్యలు, మాసం కొద్దిగా ఉప్పు, పసుపు వేసి వాటిలో నీరు ఇగిరిపోయే దాకా పొయ్యి మీద ఉంచి వేడి చేయాలి. ఇలా చేయడాన్ని కొన్ని చోట్ల ఆగిలి వేయడం అంటారు. చల్లారిన తర్వాత డబ్బాలో వేసి ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు. ఫ్రిజ్లో పెట్టకపోయినా.. మూడు నాలుగు రోజుల వరకు ఇవి నిల్వ ఉంటాయి. చేపలు అయితే ముక్కలుగా కోసి ఉప్పు వేసి డీప్ ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు. వీలుంటే వీటినే పచ్చళ్లుగా పెట్టుకుంటే.. ఎక్కువ కాలం నిల్వ ఉండడంతో పాటు.. నాన్ వెజ్ రుచిని కూడా ఆస్వాదించవచ్చు.

పండ్లు ఇలా భద్రపరచాలి..

ఈ మధ్య కాలంలో యాపిల్, ద్రాక్ష, బెర్రీస్ లాంటి పండ్లు ప్రత్యేకమైన ప్యాకేజ్ ల్లో వస్తున్నాయి. వాటిని అదే ప్యాకెట్లలో ఫ్రిజ్ లో పెడితే.. మరిన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఇతర పండ్లను ఫ్రిజ్లో పెట్టేటప్పుడు వాటిని ప్లాస్టిక్ కవర్లో ఉంచి గట్టిగా బిగించాలి. లోపలికి గాలి వెళ్లేలా అక్కడక్కడా చిన్న రంధ్రాలు చేసి ఫ్రిజ్లో ఉంచాలి. ఇతర పండ్లతో కలసి యాపిల్ పండ్లను పెట్టవద్దు. ఎందుకంటే.. ఇవి వాటిని త్వరగా ముగ్గిపోయేలా చేస్తాయి. కాబట్టి యాపిల్ పండ్లను మిగిలిన పండ్లకు దూరంగా ఉంచాలి. కివీ, మామిడి, కర్భూజ, పీచ్, అరటి పండ్లు అయితే.. బాగా ముగ్గిన తర్వాత మాత్రమే ఫ్రిజ్లో పెట్టాలి. అప్పుడే అవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.

ఏ పండ్లు ఎంత కాలం ఉంటాయంటే

పండునిల్వ ఉండే రోజులు
పుచ్చ రెండు వారాలు
యాపిల్ 3-4 వారాలు
ఆప్రికాట్ (ముగ్గినవి) 4-5 రోజులు
అవకాడో (ముగ్గినవి) 3-5 రోజులు
ద్రాక్ష 5-7 రోజులు
జామ(ముగ్గినది) 3-4 రోజులు
కర్భూజ(ముగ్గినవి) 7-10 రోజులు
ఆరెంజ్ 2-3 వారాలు
దానిమ్మ 1-2 నెలలు

ఈ టేబుల్ ఆధారంగా.. ఎక్కువ రోజులు నిల్వ ఉండే పండ్లు తెచ్చుకుని భద్రపరుచుకోవడం మంచిది.

ఫ్రిజ్లో పెట్టకపోయినా నిల్వ ఉండేవి..

మనం ఉపయోగించే ఆహారంలో చాలా వరకు ఫ్రిజ్లో నిల్వ చేసుకోవచ్చు. కానీ కొన్నింటిని మాత్రం నిల్వ చేసుకోవడానికి ఉండదు. అందులో బంగాళాదుంపలు కూడా ఒకటి. చాలామందికి బంగాళాదుంపలు ఫ్రిజ్ లో పెట్టే అలవాటు ఉంటుంది. వాటిని ఫ్రిజ్లో పెట్టడం వల్ల మనకు వచ్చిన ఉపయోగం ఏమీ లేదు. పైగా రిఫ్రిజరేటర్లో ఉండే తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా అవి కుళ్లిపోతాయి. అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. కాబట్టి వీటిని ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే.. సూర్యరశ్మి సోకని చోట భద్రపరచాలి.

ఫ్రిజ్లో పెట్టకూడనివి..

కొంతమంది ఉడకబెట్టిన గుడ్లను ఫ్రిజ్లో ఉంచుతారు. ఇలా చేయడం వల్ల వాటిలో ఉండే పోషకాలు తగ్గిపోవడంతో పాటు.. అవి రబ్బరు సాగినట్లు సాగుతాయి. అలాగే గుడ్డుతో వండిన కూరలు, ఇతర ఆహార పదార్థాలు ఫ్రిజ్లో పెట్టకూడదు. ఇలా చేయడం వల్ల మనకు కలిగే లాభం కంటే.. నష్టమే ఎక్కువ.

ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా ఆహారాన్ని ఎక్కువ రోజులు భద్రపరుచుకోవడంతో పాటు అవి తాజాగా ఉండేలా చూసుకోవచ్చు.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.