బాలయ్యకి కల్ట్ ఫ్యాన్ బేస్ ఎందుకు ఎక్కువంటే..

జై బాలయ్య.. జై జై బాలయ్య.. బహుశా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇంత కంటే పవర్ ఫుల్ స్లోగన్ ఇంకొకటి లేదేమో. భవిష్యత్తులోనూ రాదేమో. తెరమీద బాలయ్య డైలాగ్ చెబుతుంటే.. థియేటర్ విజిల్స్ తో దద్దరిల్లిపోతుంది. జానపదం, పౌరాణికం, ఫ్యాక్షన్, ఆధ్యాత్మికం, కుటుంబ కథా చిత్రం ఇలా సినిమా జోనర్ ఏదైనా సరే.. ప్రేక్షకులను మెప్పించగలిగిన నటుడు బాలకృష్ణ. నటనలో మాత్రమే కాదు.. సామాజిక సేవలోనూ ఇతర నటుల కంటే ముందుంటాడు బాలయ్య బాబు. బసవ తారకం ఆసుపత్రి ప్రారంభించి ఎంతో మందికి క్యాన్సర్ చికిత్స అందిస్తున్నారు. ఎమ్మెల్యేగా హిందూపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టిస్తున్నాడు. నటసింహం నందమూరి బాలకృష్ణ మీద అభిమానం పెంచుకున్నవారు ఆయన నుంచి దూరంగా వెళ్లడానికి ఇష్టపడరు. ఆయన్ని దగ్గరి నుంచి చూసినవారు ఆయన్ని అభిమానించకుండా ఉండలేరు. అందుకేనేమో.. తెలుగు రాష్ట్రాల్లో ఇతర సినిమా హీరోల అభిమానులతో పోలిస్తే.. బాలయ్యను అభిమానించే కల్ట్ ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉంటారు. బాలయ్యను ఇంత ఎక్కువగా అభిమానించడానికి కారణం ఏంటి?

బాలయ్యకి భేషజాలు తెలియవు. తెర మీద ఒకలా.. బయట ఒకలా ప్రవర్తించడం రాదు. ఎక్కడైైనా తనని తాను ఓ ఎంటర్టైనర్ లానే భావిస్తాడు తప్ప తనో పెద్ద హీరోని అన్న ఇగో ఉండదు. స్టేజి ఎక్కితే తనో ఆర్టిస్ట్ మాత్రమే. తన నటనతో, పాటతో, ఆటతో.. ప్రేక్షకుడిని అలరించడానికి మాత్రమే చూస్తాడు.

ఇతర హీరోలతో పోలిస్తే.. బాలయ్య అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యే పద్ధతి చాలా భిన్నంగా ఉంటుంది. నేనో పెద్ద హీరోని అనే ఫీలింగ్ లేకుండా వాళ్ల మధ్యలో కూర్చుని కబుర్లు చెబుతాడు. నిజ జీవితంలో బాలయ్యకి నటించడం రాదు. మాట్లాడే ముందు పెద్దగా ఆలోచించడు కూడా. తన మనసులో ఏది అనుకుంటాడో అదే బయటకి వస్తుంది.

తనకోసం అభిమానులు డబ్బులు ఖర్చుపెట్టడం బాలయ్యకి పెద్దగా ఇష్టం ఉండదు. అభిమానుల కోరిక మేరకు విదేశాలకు వెళ్లినప్పుడు నాకు అవి కావాలి ఇవి కావాలి అని డిమాండ్లేమీ చేయడట బాలయ్య. తను ఉండటానికి ఓ చిన్న రూము చాలు, విమానాల్లో ఎకానమీ టికెట్ చాలు అని చెప్తారట. ఈ మాట కాదని అభిమానులు ఒక్క రూపాయి ఎక్కువ ఖర్చు పెట్టినా మందలిస్తాడట. బాలయ్యది ఎంత పెద్ద మనసంటే.. తన వెంట వచ్చిన సహాయకులు, కారు డ్రైవర్లు భోజనం చేశారో లేదో తెలుసుకుని వాళ్లు తిన్నతర్వాతే తింటారట. ఇక్కడ కూడా అన్నీ పళ్లెంలో అమర్చి తీసుకొచ్చి ఇవ్వాలని అనుకోడు. తనే ప్లేటు తీసుకుని అభిమానులతో కలసి లైన్లో నుంచుని మరీ వడ్డించుకుంటాడట. ఇది చాలదా బాలయ్య ఎంత మంచి మనిషో చెప్పడానికి.

సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ అయ్యేది బాలకృష్ణే. అయితే వాటిపై ఎప్పుడూ స్పందించడు. అసలు వాటిని పెద్దగా పట్టించుకోడు కూడా. అలాగే ఎవరినీ విమర్శించడు. అది అతని మెచ్యూరిటీ. సినిమా షూటింగుల కోసం బయటకు వెళితే.. బాలయ్యకి క్యారవాన్ అవసరం లేదు. ఏ చెట్టుకిందో ఓ రుమాలు వేసుకుని నిద్రపోతాడు. అంత సింపుల్ గా ఉంటాడు.

బాలయ్య ఏ పని చేసినా చిత్తశుద్ధితో చేస్తాడు. తనకి రాకపోతే నేర్చుకుంటాడు. నూరు శాతం కష్టపడతాడు. తన పుట్టిన రోజు సందర్భంగా బాలయ్య పాడిన జగదేకవీరుని కథ సినిమాలోని ‘శివశంకరీ.. శివానంద లహరీ..’ పాట ఉదాహరణ. బాలయ్యకి సంగీతం రాకపోవచ్చు. తాను పాడిన పాటలో సంగీత పరంగా దోషాలు ఉండొచ్చు. కానీ అతి కష్టమైన పాటను పాడటానికి నూరుశాతం ప్రయత్నం చేశాడు. చిన్నాపెద్దా తారతమ్యం లేకుండా అందరికీ మర్యాదనిస్తాడు. తనకి మర్యాద ఇవ్వకపోతే సహించలేడు.

కొంతమంది హీరోలు.. తమ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే ప్రెస్ మీట్లు పెట్టి మరీ అభిమానులను రావొద్దు అని చెబుతారు. కానీ బాలయ్య మాత్రం ముందు అభిమానులను ఆహ్వానించిన తర్వాతే ఇతరులను ఆహ్వానించడం మొదలుపెడతాడు. వీలైతే వారికి స్వయంగా ఆహ్వాన పత్రికను అందిస్తాడు. అదీ బాలయ్య తన అభిమానగణానికి ఇచ్చే విలువ.

బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి ఎవరైనా విరాళమిస్తే.. వారికి స్వయంగా ధన్యవాదాలు తెలుపుతూ లేఖ పంపిస్తారు. తన అభిమానుల పట్ల, వారి అభిమానం పట్ల గౌరవం, మర్యాద చూపిస్తాడు. కల్మషం లేని మనసు, ముక్కుసూటి తనం ఆయన నైజం. అందుకే బాలయ్యకు కల్ట్ ఫ్యాన్ బేస్ ఎక్కువ. ఆయన చూపించే గౌరవానికి, అభిమానానికి ముగ్ధులయ్యే అభిమానులు ఆయన్ని బాలకృష్ణ అని కాకుండా.. బాలయ్య అంటూ తమ కుటుంబంలోని వ్యక్తిగా చేసేసుకున్నారు. అదీ ఆయన గొప్పతనం.

ఈ రోజు అరవయ్యో వసంతంలోకి అడుగుపెట్టిన బాలయ్యకు శుభాకాంక్షలు. జై బాలయ్య.. జై జై బాలయ్య..

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.