పెంగ్విన్ సినిమా రివ్యూ

లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూత పడటంతో సినిమా పరిశ్రమ చాలానే కష్టాలు ఎదుర్కుంటోంది. దీంతో ఓటీటీ యాప్ లపై దృష్టి పెట్టారు నిర్మాతలు. తాజాగా కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ కూడా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రోమోలు, టీజర్లు ఆకట్టుకోవడంతో పాటు.. ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. పై పెచ్చు.. కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాను సమర్పించడంతో సినిమాపై అంచనాలు సైతం బాగానే ఉన్నాయి. మరి ఆ అంచనాలను పెంగ్విన్ అందుకోగలిగిందా? కీర్తి సురేష్ థ్రిల్లర్ జోనర్లో మెప్పించగలిగిందా? తెలుసుకుందాం.

కథ

రిథమ్(కీర్తి సురేష్) తన కొడకు అజయ్ అంటే ప్రాణం. రెండేళ్ల వయసులో ఉన్నట్టుండి అతడు కనిపించకుండా పోతాడు. తన కోసం వెతికి వెతికి అలసిపోతుంది. అయినా తన కొడుకు కోసం అన్వేషణ ఆపదు. పైగా కొడుకు కనిపించడం లేదన్న ఆవేదనతో మానసికంగా కుంగిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆమెను వదిలేసి వెళ్లిపోతాడు ఆమె భర్త రఘు(లింగ). అయినా ఆమె మనసు నిరంతరం కొడుకు గురించే పరితపిస్తూ ఉంటుంది. కొన్నేళ్ల తర్వాత ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్న గౌతమ్(రంగరాజ్) రిథమ్ ను పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత రిథమ్ గర్భం దాలుస్తుంది. అయినా కనిపించకుండా పోయిన కొడుకు గురించే వెతుకుతుంటుంది. అనుకోని పరిస్థితుల మధ్య ఆమె తన కొడుకుని చేరుకుంటుంది. అన్ని సంవత్సరాల పాటు అజయ్ ఏమయ్యాడు? తను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు? తను కనిపించకుండా పోవడానికి కారణం ఎవరు? తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ

థ్రిల్లర్ సినిమా అంటేనే ట్విస్టులు. ఆ ట్విస్టులన్నీ ఒకదానికి ఒకటి కనెక్టయితేనే సినిమా అర్థవంతంగా ఉంటుంది. లేదంటే తుస్సుమంటుంది. పెంగ్విన్ విషయంలో జరిగింది అదే. సాధారణంగా ప్రతి సైకో చేసే క్రూరమైన చర్యల వెనుక ఓ ప్రత్యేకమైన కారణం ఉంటుంది. అతను అలా మారడానికి కచ్చితంగా ఓ బలమైన కారణం ఉంటుంది. అది కూడా చాలా కన్విన్సింగ్ గా ఉండాలి. అందులోనూ ఈ సినిమాలో కిల్లర్ 17 మంది పిల్లలను కిడ్నాప్ చేయడమే కాకుండా.. వాళ్ల ప్రాణాలు తీసిన కిల్లర్ ఎందుకు అలా చేస్తున్నాడనే ఉత్కంఠ ప్రేక్షకులకు కలుగుతుంది. కానీ దానికి సరైన కారణం చూపించలేకపోయాడు దర్శకుడు. కొడుకు కనిపించకుండా పోయి మానసికంగా బాధపడుతున్న భార్యకు అండగా నిలబడాల్సిన భర్త ఆమెను వదిలేసి వెళ్లిపోతాడు. ఈ పాయింట్ చాలా సిల్లీగా అనిపిస్తుంది. ఇలాంటి అర్థరహిత సన్నివేశాలకు సినిమాలో కొదవ లేదు. కొన్ని అనవసరమైన సన్నివేశాలున్నా.. సస్పెన్స్ కొనసాగడం వల్ల ప్రథమార్థం వరకు సినిమా కాస్త ఆసక్తికరంగానే కొనసాగుతుంది. ద్వితీయార్థం వచ్చేసరికి సినిమా మొత్తం ట్రాక్ తప్పేస్తుంది. హంతకుడు ఎవరు అనే విషయంలో ప్రేక్షకుడిని కాస్త ఉత్కంఠకు గురిచేయాలనుకున్నాడేమో హీరోయిన్ భర్త, మాజీ భర్తల మీద కాస్త ఫోకస్ పెట్టాడు. అలాగే మధ్యలో ఓ డాక్టర్ ని కూడా తీసుకొచ్చి.. అతని మీద అనుమానం పెరిగేలా చేస్తాడు. ఇవి కూడా తేలిపోవడంతో ప్రేక్షకుడి సహనానికి పరీక్ష మొదలవుతుంది. హీరోయిన్ ఓరియెంటెండ్ సినిమా కాబట్టి ఆమెకు కాస్త హైప్ ఇవ్వడానికి ట్రై చేశాడు డైరెక్టర్. నిండు గర్భిణిగా ఉన్న ఆమె తన కొడుకుతో కలిసి కిల్లర్ డెన్లోకి వెళ్లడమే కాకుండా.. మరో పాపని కూడా కాపాడే ప్రయత్నం చేస్తుంది. ఈ సీన్లో బలంగా కనిపించాల్సిన విలన్ గాలి తీసేసి… హీరోయిన్ని ధీరురాలిగా చూపించారు. కానీ నిండు గర్భిణికి ఇలాంటివి చేయడం సాధ్యమేనా? అని ఆలోచించడం మరిచిపోయినట్టున్నారు. ఇలాంటి వాస్తవ దూర సన్నివేశాలు, లాజిక్ లేని ట్విస్టుల కారణంగా సినిమా చూసేసరికి తల బొప్పి కట్టేస్తుంది.

నటీనటులు

ఈ సినిమాలో కీర్తి సురేష్ ఛాలెంజింగ్ పాత్ర చేసింది. డీ గ్లామరస్ గా కనిపించింది. గర్భిణిగా, ఎనిమిదేళ్ల పిల్లాడిలా నటించే విషయంలో సాహసమే చేసిందని చెప్పుకోవాలి. కానీ కళావిహీనంగా కనిపించింది. సినిమా బాధ్యతను తన వంతు మోసింది. కొన్ని సన్నివేశాల్లో చాలా గొప్పగా నటించిన కీర్తి.. కొన్నిచోట్ల మాత్రం హావభావాలను సరిగ్గా పలికించలేకపోయింది. అజయ్ గా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ బాగా చేశాడు. డాక్టర్ పాత్రలో చేసిన నటుడు కూడా బాగా చేశారు. ఇక మిగిలిన వారి గురించి పెద్దగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు.

సాంకేతిక వర్గం

సినిమా టెక్నికల్ వాల్యూస్ బాగున్నాయి. సినిమాకు సంతోష్ నారాయణన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ హైలైట్. సినిమాలో ఒకే ఒక్క పాట ఉంది. కానీ అది ఏమంత గొప్పగా లేదు. విజువల్స్ బాగున్నాయి. కార్తీక్ పళని కెమెరా వర్క్ ఆకట్టుకునేలా ఉంది. నిర్మాణ విలువలు సైతం అద్భుతంగా ఉన్నాయి. వీటన్నింటినీ సినిమా రచయిత, దర్శకుడు అయిన కార్తీక్ ఈశ్వర్ సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు. కథ దగ్గరే సినిమా తేలిపోయింది. స్క్రీన్ ప్లే కూడా ఏమంత గొప్పగా లేదు. దీంతో గ్రిప్పింగ్ మిస్సయింది. అక్కడక్కడా మినహా పెంగ్విన్లో పెద్ద విషయం కనిపించదు.

రేటింగ్: 2.5/5

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.